మంథని, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంథని నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దర్శించుకున్నారు.
కాటారం మండలంలోని గంగారం, కాళేశ్వరం, మహాదేవపూర్, మల్హర్రావు, కొయ్యూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆయా గణేష్ మండపాల వద్ద అర్చకులు వేదమంత్రాలతో మంత్రిని ఆశీర్వదించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి శ్రీధర్‌బాబును శాలువాలతో ఘనంగా సన్మానించారు.
మంత్రి శ్రీధర్‌బాబు వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










Leave a Reply