పాత పోలీస్ స్టేషన్–జామా మసీదు నుంచి ముత్యాలమ్మ గుడి మార్గంలో ప్రమాదకర పరిస్థితులు
దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):
దేవరకొండ పట్టణంలో ప్రజా ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇటీవల పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అయితే పాత పోలీస్ స్టేషన్, జామా మసీదు నుంచి ముత్యాలమ్మ గుడి వైపు వెళ్లే మార్గంలో వాహనాల వేగం, రోడ్డుపై పశువుల సంచారం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ఆ మార్గంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో కొంతమంది వాహనదారులు అధిక వేగంతో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాల భయం నెలకొన్నదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో పశువుల గుంపుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రోడ్డుపై పశువుల పెంటతో అపరిశుభ్రత
మరోవైపు రోడ్డుపై పశువులను కట్టివేయడం, పశువుల సంచారం కారణంగా అక్కడక్కడా పెంట పేరుకుపోతుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు అంటున్నారు. దుర్గంధం వెదజల్లడంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని, సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అవకాశం ఉండటంతో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గతంలో పశువుల కాపరులు తమ పశువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దొడ్లలో కట్టేవారని, ప్రస్తుతం ఇళ్ల సమీపంలోనే రోడ్లపై పశువులను కట్టివేస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులు తెలిపారు.
మున్సిపల్ అధికారులు స్పందించాలని విజ్ఞప్తి
ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై పశువుల సంచారాన్ని నియంత్రించడంతో పాటు అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, రోడ్డుపై పేరుకుపోయిన పశువుల పెంటను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
విద్యార్థులు, పాదచారులు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు ఇకనైనా ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.










Leave a Reply