మాలలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన — రోస్టర్లో 1 నుంచి 20లోపు రెండు స్థానాలు కేటాయించాలని డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
రోస్టర్ సవరణ పేరుతో మాలలకు అన్యాయం జరుగుతోందని, న్యాయమైన ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా ఉద్యమించాలని బహుజన మేధావి, అంబేద్కరైట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డా. యేకుల రాజారావు పిలుపునిచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఆదివారం రోస్టర్ సవరణ విధానంపై మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులతో సభ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బహుజన మేధావులు, ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న డా. యేకుల రాజారావు మాట్లాడుతూ, రోస్టర్ సవరణ విధానంతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధమైన ప్రాతినిధ్యం దెబ్బతింటోందని, ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణలో శాస్త్రీయత లోపించిందని, మాలల జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా దక్కడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించి, రోస్టర్లో 1 నుంచి 20లోపు రెండు స్థానాలను మాలలకు కేటాయించేలా చట్టబద్ధంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మాలల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ప్రాతినిధ్యం కోసం రాష్ట్రంలోని మాల ఉద్యోగులు, మేధావులు, సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నల్లగొండ జిల్లా మేధావులు, మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు యేకుల సురేష్, దేవరకొండ నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షుడు చంద్రమౌళి, గోకమల్ల ఆంజనేయులు, నారిమల్ల భాస్కర్, మేకల చెన్నయ్య, శీను, చేపూరి మురళి, గండి మల్ల సుగ్రీవులు, రాష్ట్రంలోని పలువురు మేధావులు, సంఘాల నాయకులు, ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.










Leave a Reply