వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి.. మౌలిక వసతులు కల్పించాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్
AYUSH24 News ప్రతినిధి
దేవరకొండ: సెప్టెంబర్ 29
దేవరకొండ నియోజకవర్గంలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ ఆరోపించారు.
మంగళవారం దేవరకొండలో ఆయన మాట్లాడుతూ.. హాస్టల్ వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదని, సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను కొన్ని హాస్టళ్లలో సక్రమంగా అమలు చేయడం లేదని, నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని పేర్కొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉండని వార్డెన్లపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మౌలిక వసతుల కొరత, మెస్ సమస్యలు, పారిశుద్ధ్య లోపాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ హాస్టళ్లను అభివృద్ధి చేశామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వాటి పరిస్థితి దయనీయంగా మారుతోందని బొడ్డుపల్లి కృష్ణ విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్లో ఉన్న కాస్మెటిక్, మెస్ ఛార్జీలను విడుదల చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు హాస్టళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply