ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే సమగ్ర ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రణాళికలు
హైటెక్ సిటీలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బ్యాక్‌బేస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం
కొత్తగా 300 మంది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్, అక్టోబర్ 09, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
హైదరాబాద్‌ను కేవలం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) గమ్యస్థానంగానే కాకుండా, ప్రపంచ స్థాయి సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందించే ‘గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్’గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
గ్లోబల్ మార్కెట్ అవసరాలు, భవిష్యత్ సాంకేతిక మార్పులు, అంతర్జాతీయ కంపెనీల సవాళ్లకు అనుగుణంగా తెలంగాణలో సమగ్ర సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్ ఫిన్‌టెక్ సంస్థ ‘బ్యాక్‌బేస్’ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.
డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాలకు హైదరాబాద్ కేంద్రం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తక్కువ కాలంలోనే టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ కంపెనీలకు ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

బ్యాక్‌బేస్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరించడం రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక వ్యవస్థకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
కేవలం పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా, వాటి అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
అత్యాధునిక డిజిటల్ మౌలిక వసతులకు ప్రాధాన్యం
డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు.
అంతర్జాతీయ కంపెనీల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో అత్యాధునిక డిజిటల్ మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం
ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
కొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలతో ముందుకు వచ్చే యువత, పరిశోధకులు, సాంకేతిక సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు.
బ్యాక్‌బేస్ సెంటర్ ద్వారా 300 ఉద్యోగాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను అందించడంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బ్యాక్‌బేస్ డెవలప్‌మెంట్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వివరించారు.
ఈ కేంద్రం ద్వారా 300 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన నిపుణులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ యాన్ క్రెమర్స్, బ్యాక్‌బేస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ) గ్రెగ్ ఫాహి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రీన్‌హార్డ్ షీల్, ఇండియా సైట్ హెడ్ సురభి శర్మ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply