పదేళ్ల తర్వాత ఎన్నికలు — కూటములుగా బరిలోకి కార్మిక సంఘాలు
రాష్ట్ర, రీజియన్ స్థాయి గుర్తింపు సంఘాలకు కార్మికులకు రెండేసి ఓట్లు
హైదరాబాద్, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వచ్చే నెల 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సుమారు పదేళ్ల అనంతరం ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుండటంతో కార్మిక సంఘాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
ఈసారి యూనియన్లు వేర్వేరు కూటములుగా ఏర్పడి బరిలోకి దిగడంతో ముక్కోణపు పోరు నెలకొంది. తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)కు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించగా, ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)కు సీపీఐ మద్దతు ప్రకటించింది. దీంతో ఈ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ ఎన్నికల్లో ప్రతి కార్మికుడికి రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటు రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘానికి, మరో ఓటు రీజియన్ స్థాయి గుర్తింపు సంఘానికి వేయాల్సి ఉంటుంది.
వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) వేర్వేరు కూటముల్లో ఉన్నాయి. ఈయూతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) జట్టు కట్టాయి. ఈ కూటమి నుంచి రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘానికి ఈయూ పోటీ చేస్తోంది.
ఆర్టీసీలో మొత్తం 11 రీజియన్లు ఉండగా, వరంగల్, ఖమ్మం రీజియన్లలో ఎన్ఎంయూ, మిగిలిన తొమ్మిది రీజియన్లలో రీజియన్ స్థాయి గుర్తింపు సంఘం కోసం టీఎంయూ ఈ కూటమి తరఫున బరిలో నిలిచాయి.
మరోవైపు సీఐటీయూ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్), తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)తో జట్టు కట్టడంతో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.










Leave a Reply