ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో విద్యార్థులకు శిక్షణ: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కాటారం, సెప్టెంబర్ 23 (ప్రతినిధి): కాటారం మండల కేంద్రంలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మంత్రి మాట్లాడి, వారికి అందుతున్న శిక్షణ, సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు భవిష్యత్‌లో అందుబాటులో ఉండే ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 100 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, తొలి విడతలో 65 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాటారం ఏటీసీలో మొదటి సంవత్సరంలో 172 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రిన్సిపాళ్లు, ట్రైనర్లు, సంబంధిత సంస్థల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం, స్కిల్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాటారం ఏటీసీకి వివిధ మండలాల నుంచి విద్యార్థులు వచ్చి నైపుణ్యాలు సాధించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. విద్యార్థులకు యూనిఫాం, షూస్‌ను తన సొంత ఖర్చులతో అందిస్తామని మంత్రి వెల్లడించారు.
ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఐటీఐలు, పాలిటెక్నిక్ విద్యకు మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయ ట్రేడ్లకే పరిమితం కాకుండా రోబోటిక్స్, బ్యాటరీ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి ఆధునిక రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను గుర్తించి, అందుకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
ఏటీసీలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించామని మంత్రి తెలిపారు. ల్యాబొరేటరీలు, క్లాస్‌రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.










Leave a Reply