నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని కేతావత్ బాబురామ్ నాయక్, ఎండి. సిరాజ్ ఆరోపణ
నల్లగొండ, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): కొండమల్లేపల్లిలోని ‘ఎస్పీఆర్ హైస్కూల్’లో అనధికారికంగా తరగతులు నిర్వహించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా నివాస హాస్టల్‌ను నడుపుతున్నారని ఆరోపిస్తూ వాటిని తక్షణమే నిలిపివేసి హాస్టల్‌ను సీజ్ చేయాలని సమాచార హక్కు సేవా సొసైటీ (ఆర్టీఐఎస్ఎస్) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కేతావత్ బాబురామ్ నాయక్, వైఎస్సార్ విద్యార్థి విభాగం (వైఎస్సార్‌ఎస్‌యూ) జిల్లా అధ్యక్షుడు ఎండి. సిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ పవన్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆగస్టు 3న పాఠశాల నిర్వహణలో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై క్షేత్రస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ, విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టలేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అనుమతులు లేని పాఠశాల, అగ్నిమాపక భద్రత లేని హాస్టల్ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
పాఠశాల పేరు మార్పు, గుర్తింపు వ్యవహారం తెలంగాణ హైకోర్టు, రంగారెడ్డి జిల్లా కమర్షియల్ కోర్టు పరిధిలో న్యాయ విచారణలో ఉందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రాంతీయ పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుల ఉత్తర్వుల నేపథ్యంలో పాఠశాల ఏ అధికారంతో కొనసాగుతోందో విద్యాశాఖ అధికారులు లిఖితపూర్వకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అక్రమంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్న ప్రవేశాలు, బోర్డులు, తరగతులను నిలిపివేయడంతో పాటు అనుమతులు లేని నివాస హాస్టల్‌ను సీజ్ చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను అందించాలని విజ్ఞప్తి చేశారు.
మూడు రోజుల్లో విద్యాశాఖ స్పందించాలని, వారం రోజుల్లో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయించడంతో పాటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.









Leave a Reply