పదేళ్ల విరామం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు.. ప్రచారంలో కార్మిక సంఘాలు
హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో సుదీర్ఘ విరామం తర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతుండటంతో కార్మికుల్లో ఎన్నికల సందడి నెలకొంది. దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో పోటీలో ఉన్న కార్మిక సంఘాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న 12 సంఘాలకు హైదరాబాద్ జంటనగరాల సంయుక్త లేబర్ కమిషనర్, రిటర్నింగ్ అధికారి ఎన్నికల గుర్తులను కేటాయించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు నిచ్చెన గుర్తు కేటాయించగా, ఇతర కార్మిక సంఘాలకు కత్తెర, బస్సు, బస్సు టైరు, పులి, ధర్మచక్రం, బాణం, నక్షత్రం, చేతిలో కాగడా, గద, బతుకమ్మ తదితర గుర్తులను కేటాయించారు.
అక్టోబర్ 9న రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించనుండగా, అక్టోబర్ 17న ఫలితాలను ప్రకటించనున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఎన్నికల గుర్తులు ఖరారు కావడంతో సంఘాలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.
సుదీర్ఘ విరామం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన కార్మిక సంఘాలు తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన గుర్తింపు సంఘానికి కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించనుంది.
పలు సంఘాలకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.










Leave a Reply