ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ నవంబర్ 6వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి నేనావత్ శివ నాయక్ పిలుపునిచ్చారు.
మంగళవారం దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాల్లో పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శివ నాయక్ మాట్లాడుతూ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో విద్యావంతుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.
గ్రామస్థాయి వరకు ఓటరు నమోదు కేంద్రాలు
పట్టభద్రుల ఓటరు నమోదును సులభతరం చేసేందుకు దేవరకొండ పట్టణంతో పాటు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు శివ నాయక్ వెల్లడించారు. అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఐదు ప్రధాన అంశాలతో ముందుకు
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఉపాధి, ఉచిత వైద్యం, ఉచిత విద్య, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే ఐదు ప్రధాన అంశాలతో ముందుకు సాగుతున్నట్లు శివ నాయక్ తెలిపారు. రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.
ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి
ఎల్నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శివ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.5 వేల మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి లకుమారపు మల్లయ్య, యూత్ ప్రెసిడెంట్ రమేష్, జాయింట్ సెక్రటరీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply