ప్రయోగాత్మక సాగుతో ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్న రైతు
అంతర పంటల సాగును అభినందించిన వ్యవసాయ అధికారి
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
పత్తిలో అంతర పంటగా మినుములు సాగు చేయడం ద్వారా అదనపు దిగుబడితో పాటు ఆదాయం పొందుతున్నట్లు దేవరకొండ మండలానికి చెందిన రైతు కోర్ర మంత తెలిపారు.
దేవరకొండ మండలం కోర్రతండా గొట్టిముక్కలకు చెందిన రైతు కోర్ర మంత తనకున్న వ్యవసాయ భూమిలో జూన్ 15న పత్తితో పాటు మినుములను అంతర పంటగా సాగు చేశారు. ఇందుకోసం మధిర నుంచి తీసుకొచ్చిన 1070 ఎంజీవీ రకం విత్తనాలను ఉపయోగించినట్లు తెలిపారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అంతర పంటగా సాగు చేసిన మినుముల్లో ఎకరాకు సుమారు 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్లు చెప్పారు. అంతర పంట కారణంగా పొలంలో కలుపు పెరుగుదల కూడా తగ్గిందని, దీంతో కలుపు తొలగింపునకు అయ్యే శ్రమ, ఖర్చు తగ్గినట్లు వివరించారు.
తాను సాగు చేసిన మినుము రకంలో ఒక్కో కాయలో సుమారు ఐదు నుంచి ఆరు గింజలు వస్తున్నాయని తెలిపారు. మార్కెట్లో మినుములకు మంచి ధర లభిస్తే పత్తితో పాటు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని రైతు మంత పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దేవరకొండ వ్యవసాయ అధికారి రవికుమార్ మాట్లాడుతూ రైతు మంత నూతన పద్ధతులను అనుసరిస్తూ అంతర పంటల ద్వారా మంచి దిగుబడి సాధించడం అభినందనీయమన్నారు. పత్తిలో మినుములు వంటి అంతర పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
అంతర పంటల సాగు భూమి వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు పంటల వైవిధ్యానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతు మంత తన వద్ద ఉన్న విత్తనాలను ఇతర రైతులకు ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమని రవికుమార్ అభినందించారు.
స్థానిక పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ అధికారుల సూచనలతో రైతులు అనుకూలమైన అంతర పంటలను సాగు చేయాలని సూచించారు.










Leave a Reply