వరంగల్, సెప్టెంబర్ 22 (ప్రతినిధి): వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతుండటంపై అధికారులను సీఎం ప్రశ్నించారు.
వచ్చే 30 రోజుల్లో ఆసుపత్రి నిర్మాణ పనులను 24 గంటల పాటు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పనులకు సంబంధించి స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి, దాని ప్రకారం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీ పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రుల నిర్మాణం, అభివృద్ధి పనులపై కూడా సీఎం సమీక్షించారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారిని బాధ్యుడిగా నియమించి, ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. భవన నిర్మాణానికి సంబంధించిన శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆసుపత్రి పరిసరాలను రోగులు, వారి కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉండేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు సూచించారు.










Leave a Reply