ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌కు చెందిన రెండు విమానాలు 24 గంటలకు పైగా ఆలస్యమయ్యాయి. నిర్ణీత సమయానికి విమానాలు బయలుదేరకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు విసుగు చెందిన ప్రయాణికులు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు.
స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్జీ 5111, ఎస్జీ 5105 విమానాలు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం దుబాయ్‌కు బయలుదేరాల్సి ఉంది. ఒక విమానం ఉదయం, మరో విమానం సాయంత్రం బయలుదేరాల్సి ఉండగా.. నిర్ణీత సమయానికి విమానాలు బయలుదేరలేదు. పలుమార్లు విమానాల షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేసినప్పటికీ ప్రయాణం ప్రారంభం కాలేదని ప్రయాణికులు తెలిపారు.
దాదాపు 24 గంటలు గడిచినా విమానాలు బయలుదేరకపోవడంతో సుమారు 200 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షించాల్సి వచ్చినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం నుంచి టెర్మినల్-3 వద్ద పలుమార్లు ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు.
ప్రయాణికుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు స్పైస్‌జెట్ సంస్థను సంప్రదించారు. విమానాల ఆలస్యంపై సంస్థ విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించినట్లు తెలుస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మంగళవారం సాయంత్రం వరకు విమానాలను దుబాయ్‌కు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
విమానాల ఆలస్యానికి గల కచ్చితమైన కారణాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply