బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ
దేవరకొండ, ఆగస్టు 24 | అయుష్ 24 న్యూస్
జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెట్టారని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ఆరోపించారు. సోమవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, వారి ఆందోళనలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై అనేక సందేహాలు నెలకొన్నాయని బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. స్కిల్ యూనివర్సిటీ చట్టంలోని నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను దాని పరిధిలోకి తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు.
విద్యార్థుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్వీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి పక్షాన పోరాడుతామని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే జీవో 97పై పునరాలోచించి, పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply