విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం: ప్రిన్సిపాల్ డాక్టర్ రామావత్
దేవరకొండ, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్
విద్య ద్వారానే వికాసంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం లభిస్తుందని దేవరకొండ మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి అన్నారు.
మంగళవారం కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా “ఓరియంటేషన్ డే” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యా విధానం, అకాడమిక్ కార్యకలాపాలు, కళాశాలలో అందుబాటులో ఉన్న వనరులు, నియమ నిబంధనలు, విద్యార్థుల బాధ్యతలు తదితర అంశాలపై నూతన విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఉన్నత విద్య అనేది కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి మాత్రమే కాకుండా జ్ఞానం, నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. విద్యార్థులు తరగతి గది బోధనతో పాటు గ్రంథాలయం, ప్రయోగశాలలు, డిజిటల్ వనరులు, సాంకేతిక సదుపాయాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమయపాలన పాటించడం, తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావడం, కళాశాల ప్రాంగణంలో క్రమశిక్షణతో మెలగడం, అధ్యాపకులు, తోటి విద్యార్థులను గౌరవించడం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని సూచించారు.
అకాడమిక్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల విద్యా ప్రగతికి అనుసరించే అకాడమిక్ విధానం, తరగతుల నిర్వహణ, హాజరు, అంతర్గత మూల్యాంకనం, పరీక్షా విధానం, అసైన్మెంట్లు, సెమినార్లు, ప్రాజెక్టులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జి. కోటయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి. లింగారెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. కె. పృథు, డా. ఎం. ప్రభాకర్, డా. వి. మకట్లాల్, డా. కె. రేణుక తదితర అధ్యాపకులు, ప్రథమ సంవత్సరం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.










Leave a Reply