సంకటాలు తొలగించే సంకష్టహర చతుర్థి
శ్రావణ మాసంలోని చతుర్థికి ప్రత్యేక విశిష్టత
మంథని, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనదని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా సోమవారం మంథని పట్టణంలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువుదీరిన గణనాథుడిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంకష్టహర చతుర్థి రోజున ఉపవాస దీక్ష చేపట్టి శ్రీ విఘ్నేశ్వరుడిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు, విఘ్నాలు తొలగిపోతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయని భక్తులు తెలిపారు. స్వామివారికి పూజలు నిర్వహించి ఆలయంలో 21 ప్రదక్షిణలు చేసి మోదకాలు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ రోజున చంద్రోదయం అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించి భోజనం చేయడం సంకష్టహర చతుర్థి దీక్షలో ప్రధానమైన ఆచారమని పేర్కొన్నారు.
గణపతికి ఇష్టమైన గరిక (దూర్వాలు) 121 సమర్పించడం, 121 ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించడం ద్వారా విఘ్నేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే “ఓం గం గణపతయే నమః” మంత్రాన్ని స్మరిస్తూ స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని శ్రీ మహాగణపతి దేవాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అర్చకులు పల్లి రాము ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
అయుష్ 24 న్యూస్ | పెద్దపల్లి జిల్లా, మంథని









Leave a Reply