ముదిరాజుల అభ్యున్నతికి ఆయన చూపిన బాటలో నడవాలి: ఎన్. రాజు ముదిరాజ్
పటాన్చెరు, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం హైదరాబాద్కు తొలి మేయర్గా బాధ్యతలు చేపట్టిన కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 133వ జయంతి వేడుకలను పటాన్చెరులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మినిమం వేజెస్ బోర్డు సభ్యులు ఎన్. రాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ముదిరాజుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ముదిరాజ్ సంఘాలను ఏర్పాటు చేసి, సమాజంలోని ప్రతి ఒక్కరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆనాడే కృషి చేశారని తెలిపారు.
కృష్ణస్వామి ముదిరాజ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి హైదరాబాద్లో ముదిరాజ్ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ముదిరాజ్ సంఘాల పెద్దలు, యువత, మహిళలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా విద్య, వైద్యం, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ముదిరాజ్ సమాజం మరింత అభివృద్ధి చెందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, సంఘ నాయకులు, యువతీ యువకులు, మహిళలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.










Leave a Reply