ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన సర్పంచ్ పల్ల శ్రీకాంత్ రెడ్డి
విద్యార్థుల, పాఠశాల అభివృద్ధికి సేవలందించిన ఉపాధ్యాయులకు అభినందనలు
దేవరకొండ, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:
ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని పడమటిపల్లి సర్పంచ్ పల్ల శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పడమటిపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చిన్నానాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సరస్వతీ దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయులు, ‘మనం మనబడి’ ఫౌండేషన్ ట్రెజరర్ నల్లమాద నారాయణరెడ్డి, పల్ల వెంకట్ రెడ్డి, ఎం. నారాయణ సింగ్లను ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్, ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పల్ల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గురువును మించిన దైవం లేదని, ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వంతోనే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోగలరని అన్నారు. తాను ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న క్రమంలోనూ తన పాఠశాల ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు.
ప్రజల మన్ననలు పొందడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంలో పాఠశాల తరగతి గది తనకు ఎంతో నేర్పిందని చెప్పారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు.
పడమటిపల్లి పాఠశాలలో ఉత్తమ బోధన అందించిన నారాయణరెడ్డి, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి కృషి చేసిన పల్ల వెంకట్ రెడ్డి, తన సొంత ఆర్థిక సహాయంతో విద్యార్థులకు అండగా నిలిచిన ఎం. నారాయణ సింగ్ సేవలను సర్పంచ్ అభినందించారు. వారి సేవలను పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పుష్పాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ‘మనం మనబడి’ ఫౌండేషన్ అధ్యక్షులు వెంకట్ నరసింహ, మసన శివ తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply