గిరిజనుల అభ్యున్నతికి కేసీఆర్ కృషి ఎనలేనిది: మాజీ ఎమ్మెల్యే
ఇల్లందు, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
గిరిజనుల అభ్యున్నతికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు కీలకమని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు.
గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేలా బీఆర్ఎస్ రాష్ట్ర ఎస్టీ నాయకత్వం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా మంగళవారం ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యాలయంలో ఎస్టీ ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరిప్రియ నాయక్‌తో పాటు మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. గిరిజనుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ చర్య గిరిజనుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె అన్నారు.
రిజర్వేషన్ల పెంపుతో గిరిజన విద్యార్థులకు విద్యా రంగంలో ప్రయోజనాలు కలిగాయని తెలిపారు. అలాగే 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం, గిరిజన గురుకులాలను ఏర్పాటు చేయడం, సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడం వంటి కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు.
కేసీఆర్ గిరిజనుల పట్ల చూపిన చొరవకు కృతజ్ఞతగా సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవంతో పాటు ప్రతి తండా, ప్రతి గూడెంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు హరిప్రియ నాయక్ పిలుపునిచ్చారు.
అర్హులైన గిరిజన పోడు రైతులకు పోడు భూములపై హక్కు పట్టాలు అందించడం కూడా గిరిజనుల చిరకాల కోరికను నెరవేర్చిన చర్యగా ఆమె పేర్కొన్నారు.

అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని హరిప్రియ నాయక్ విమర్శించారు. లగచర్ల ఘటనను ప్రస్తావిస్తూ, గిరిజన భూములు, గిరిజనుల సమస్యల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, రాబోయే రోజుల్లో ప్రజలు తమ ఓటు హక్కుతో తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, లకావత్ దేవిలాల్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఎం.డి. అబ్దుల్ జబ్బార్, మాజీ మండల అధ్యక్షుడు శీలం రమేష్, టీజీబీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్. రంగనాథ్, నియోజకవర్గ సీనియర్ నాయకుడు భూక్య దల్సింగ్, టేకులపల్లి మండల మాజీ అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్, బయ్యారం మండల మాజీ అధ్యక్షుడు తాత గణేష్, టేకులపల్లి సర్పంచ్ బోడబాలు నాయక్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బర్మావతులాల్ సింగ్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ బండారి శీను, 11వ వార్డు మాజీ కౌన్సిలర్ జేకే శీను తదితర గిరిజన నాయకులు పాల్గొన్నారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply