తల్లిదండ్రుల సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో
సిరిసిల్ల, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): సిరిసిల్లలోని గీతానగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశం వినూత్న ప్రయోగానికి వేదికైంది. బెంగళూరుకు చెందిన ఇండస్ కంపెనీ ల్యాబ్ వారు పాఠశాలకు బహుకరించిన రోబో టీచర్ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేసేందుకు ఇది వినూత్న ప్రయత్నమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. రోబో టీచర్ ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన బోధన అందించడంతో పాటు, పాఠ్యాంశాలను మరింత ఆసక్తికరంగా నేర్చుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
రోబో కంపెనీ డైరెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా బోధనలో భాగంగా చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి, అభ్యసన సామర్థ్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే తొలి రోబో టీచర్ అని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. ఈ వినూత్న ప్రయత్నంపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆసక్తి వ్యక్తం చేశారు.










Leave a Reply