సిలబస్ మార్పులపై అనధికారిక ప్రచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు సూచన
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ప్రతినిధి):
తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్‌లో మార్పులు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక స్పష్టత ఇచ్చింది. సిలబస్ మార్పులకు సంబంధించి అభ్యర్థుల నుంచి పలు వినతులు, సందేహాలు అందుతున్న నేపథ్యంలో కమిషన్ సెప్టెంబర్ 21న వెబ్‌నోట్ విడుదల చేసింది.
ప్రస్తుతం సిలబస్‌ను మార్చేందుకు ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఏదైనా నియామక పరీక్ష సిలబస్‌లో పెద్దస్థాయిలో మార్పులు చేయాలని నిర్ణయిస్తే.. అభ్యర్థులకు తగినంత సమయం లభించేలా కనీసం ఏడాది ముందుగానే సమాచారం అందిస్తామని తెలిపింది.
అదేవిధంగా సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసినా వాటిని అభ్యర్థులకు తెలియకుండా చేయబోమని కమిషన్ స్పష్టం చేసింది. సంబంధిత ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేసే సమయంలోనే సవరించిన సిలబస్ వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొంది.
అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దు
సిలబస్ మార్పులపై సోషల్ మీడియా, ఇతర అనధికారిక వేదికల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని టీజీపీఎస్సీ సూచించింది.
పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానం, అర్హతలు, నియామక ప్రక్రియ తదితర అంశాల్లో టీజీపీఎస్సీ అధికారికంగా విడుదల చేసే నియామక ప్రకటనలు, సిలబస్ వివరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ అధికారికంగా గత నియామకాలకు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానాలను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతోంది.










Leave a Reply