అయుష్ 24 న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్, అగ్నిమాపక, జైళ్ల, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ శాఖల్లోని కానిస్టేబుల్, సమాన స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే యూనిఫాం సర్వీసుల ప్రత్యక్ష నియామకాలకు ఇచ్చిన ఏడేళ్ల వయో సడలింపునకు అదనంగా ఈ మూడేళ్ల వెసులుబాటు కల్పించారు. హోంశాఖలో సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల వయోపరిమితుల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించడమే తాజా నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటివరకు ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 29 ఏళ్లుగా ఉంది. దీంతో కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు మరో మూడేళ్ల సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ఉత్తర్వులతో అర్హత ఉన్న మరింత మంది అభ్యర్థులకు పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం లభించనుంది.
ఈ వయో సడలింపు పోలీస్ శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, ప్రిజన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లోని కానిస్టేబుల్, సమాన స్థాయి పోస్టులకు వర్తించనుంది. అయితే పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు మాత్రం ఈ మూడేళ్ల వయో సడలింపు వర్తించదు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టే ప్రత్యక్ష నియామకాల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ పోలీస్ ఉద్యోగాల అభ్యర్థుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని పెంచడంతో పాటు పోలీస్ నియామకాల ఫిజికల్ ఈవెంట్లలో లాంగ్‌జంప్ అర్హత ప్రమాణాన్ని సడలించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ప్రభుత్వం కానిస్టేబుల్ స్థాయి పోస్టుల వయోపరిమితి పెంపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.









Leave a Reply