కోతుల దాడులతో భయాందోళనలో వార్డు ప్రజలు
రాకపోకలకు జంకుతున్న స్థానికులు.. శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్
మంథని, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
మంథని మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కూచిరాజుపల్లిలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, అవసరమైన పనుల కోసం బయటకు వెళ్లాలన్నా జంకాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.
బుధవారం కూచిరాజుపల్లికి చెందిన అంబటి శ్రావణ్‌పై కోతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన శ్రావణ్‌ను ప్రథమ చికిత్స కోసం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
స్థానికుల వివరాల ప్రకారం.. గత వారం రోజులుగా కోతుల దాడుల్లో పలువురు గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దారిన వెళ్లే ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను కోతులు వెంబడిస్తూ దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చర్యలు ఎక్కడ? అని ప్రశ్నిస్తున్న ప్రజలు
కోతుల సమస్యను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు నివారణ చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోతుల బెడద కారణంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని తెలిపారు. తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది సమన్వయంతో కోతుల సమస్యను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కూచిరాజుపల్లి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.










Leave a Reply