విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు.
మంథనిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 8న మంథని రూరల్, మంథని అర్బన్, ముత్తారం, రామగిరి ఎస్జీఎఫ్ జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు శుక్రవారం కొత్త శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన అవకాశాలు కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మాచిది రాజు గౌడ్, ఆర్టీఐ మెంబర్ మంథని సురేష్, పీఈటీ దొమ్మటి రవి, కొమురోజు శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply