ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
మంథని, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): భావితరాలకు స్వచ్ఛమైన, పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ అన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ మహాలక్ష్మి దేవాలయం వద్ద స్థానిక కౌన్సిలర్ మారుపాక నిహారికతో కలిసి శుక్రవారం భక్తులు, స్థానిక ప్రజలకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చెట్లను విరివిగా పెంచడం ఎంతో అవసరమని అన్నారు. కేవలం మొక్కలు నాటడంతో బాధ్యత పూర్తికాదని, అవి మహావృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.
పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి పౌరుడు తమ వంతు కృషి చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడటం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు నూకల కమల్, జంభోజు శ్రీమతి, పెంటరి రాజు, జంభోజు సమ్మయ్య, దుద్దిల్ల గణపతి, మున్సిపల్ సిబ్బంది, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply