2,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.. తయారీదారుల గుర్తింపునకు దర్యాప్తు
మంథని, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
మంథని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో అక్రమ గుడుంబా తయారీకి వినియోగిస్తున్నట్లు గుర్తించిన బెల్లం పానకం నిల్వ స్థావరంపై మంథని పోలీసులు మెరుపుదాడి చేశారు. మంథని సీఐ బుద్దె స్వామి ఆధ్వర్యంలో గురువారం ఈ ఆపరేషన్ నిర్వహించారు.
పోలీసుల తనిఖీల్లో ప్లాస్టిక్ క్యాన్లు, డ్రమ్ముల్లో నిల్వ చేసిన సుమారు 2,000 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించారు. పంచుల సమక్షంలో పానకాన్ని స్వాధీనం చేసుకుని, అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా ఈ స్థావరాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐ బుద్దె స్వామి మాట్లాడుతూ.. పల్లెలు, పట్టణాల్లో గుడుంబా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడుంబా సేవించడం ఆరోగ్యానికి తీవ్ర హానికరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అక్రమ గుడుంబా తయారీ లేదా నిల్వకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో హెడ్ కానిస్టేబుళ్లు కృష్ణ నాయక్, రమేష్‌రావు, కానిస్టేబుళ్లు శివ, అజిత్, సతీష్, అంజి తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్









Leave a Reply