రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఏది?
వ్యవసాయ సీజన్లో 8 గంటల కోతలతో అన్నదాతలు అల్లాడుతున్నారు
సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ఆరోపించారు.
సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు కనీసం 8 గంటలు కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ అందడం లేదని, విద్యుత్ కోతల కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు రాజ్యమని చెప్పుకునే ప్రభుత్వం సాగు సమయంలో విద్యుత్ కోతలు విధించడం సరికాదని విమర్శించారు. పొలాలకు నీరు అందించాల్సిన కీలక సమయంలో అరకొరగా విద్యుత్ సరఫరా చేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర సాగు పెట్టుబడుల కోసం రైతులు బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. కరెంట్‌పై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న సమయంలో సమయానికి విద్యుత్ అందకపోతే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పంటలు దెబ్బతిని అప్పులు తీర్చలేని పరిస్థితి వస్తే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి రైతుకు సాగునీరు, విద్యుత్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి బానోత్ నాగరాజు నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి జరుపుల లాలు నాయక్, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply