అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశాలు
దేవరకొండ, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్: దేవరకొండ నియోజకవర్గంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా, సాగులో ఉన్న పంటలకు చివరి వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలోని విద్యుత్, ఇరిగేషన్, పోలీస్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే బాలు నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

అందుబాటులో ఉన్న డిండి ప్రాజెక్టు నీటిని పొదుపుగా, ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు చివరి వరకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రైతులు కూడా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
అదేవిధంగా గ్రామాల్లో రైతులు, ప్రజలకు ఎక్కడా విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు.
“వర్షాలు సకాలంలో లేక నీటి లభ్యతపై జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం సాగులో ఉన్న రైతుల పంటలు ఎండిపోకుండా డిండి ప్రాజెక్టు నీటిని పొదుపుగా వినియోగించి చివరి వరకు నీరు అందించాలి. రైతులకు విద్యుత్, సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి” అని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో విద్యుత్, ఇరిగేషన్, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.










Leave a Reply