నూతన వంగడాలతో పంటలు.. పంట మార్పిడితో ఆదర్శ సాగు
దేవరకొండ, సెప్టెంబర్ 20 (ప్రతినిధి):
వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తూ, నూతన వంగడాలతో పంటలు సాగు చేస్తున్న అభ్యుదయ రైతు కొర్ర మంగ్తాకు నంది అవార్డు లభించింది. నూతన వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్లోబల్ ఎక్సలెంట్ ఐకాన్ 2026 అమెజాన్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కాటేదాన్ స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో కొర్ర మంగ్తాను అభ్యుదయ రైతుగా గుర్తించి నంది అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేసి అభినందించారు.
నూతన వంగడాలతో తక్కువ పెట్టుబడితో సాగు
దేవరకొండ మండలం గొట్టిముక్కల కొర్రతండాకు చెందిన కొర్ర మంగ్తా వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో శాస్త్రవేత్తల ద్వారా నూతన పంట వంగడాలపై సమాచారం తెలుసుకుని తన వ్యవసాయ క్షేత్రంలో వాటిని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, లాభదాయకత సాధించే పంటలను సాగు చేయడంతో పాటు, తనకు అందుబాటులోకి వచ్చిన కొన్ని వంగడాలను ఇతర రైతులకు ఉచితంగా అందజేస్తున్నారని పేర్కొన్నారు.
పంట మార్పిడితో భూసార పరిరక్షణ
భూమి సారాన్ని కాపాడేందుకు సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడంతో పాటు, రైతులకు ఉపయోగపడే సాగు విధానాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
పంటల దిగుబడులను పెంచుకునేందుకు దేవరకొండ మండల వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ సాగు చేస్తున్నారని తెలిపారు. తాను అనుసరించిన పద్ధతులు, అనుభవాలను ఇతర రైతులతో పంచుకుంటూ వారికి సూచనలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో కొర్ర మంగ్తా చేస్తున్న కృషి, పట్టుదల, ప్రయోగాత్మక సాగు విధానాలు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఆయన సేవలను గుర్తిస్తూ అభ్యుదయ రైతుగా నంది అవార్డుతో సత్కరించినట్లు వెల్లడించారు.










Leave a Reply