మురుగునీటితో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని స్థానికుల హెచ్చరిక
దేవరకొండ, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల గేటు ముందు డ్రైనేజీ నీరు నిలిచి ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో పాఠశాలకు రాకపోకలు సాగించే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.
పాఠశాల గేటు ముందు మురుగునీరు నిలిచి ఉండటంతో పరిసర ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోందని, చిన్నారులు ముక్కులు మూసుకుని పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని, దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై మున్సిపాలిటీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపించారు. సానిటరీ ఇన్స్పెక్టర్కు కూడా సమస్యను వివరించినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని తెలిపారు.
పాఠశాల విద్యార్థులు, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి పాఠశాల గేటు ముందు నిలిచిన మురుగునీటిని తొలగించాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.










Leave a Reply