ఇల్లందు, సెప్టెంబర్ 21 (ప్రతినిధి): కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు.
సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ లేబర్ INTUC యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు.
కార్మికుల వివరాల ప్రకారం.. స్థానిక KOCలో LSN Minerals Private Limited సంస్థ టెండర్ పద్ధతిలో గత మూడు సంవత్సరాలుగా KOC Pit-1లో OB, కోల్ వెలికితీత పనులను కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహిస్తోంది. ఈ పనుల్లో సుమారు 350 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిపారు.

జూన్ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు 15 నెలలకు సంబంధించిన EPF బకాయిలతో పాటు ఆగస్టు నెల వేతనం, బోనస్ చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
కార్మికుల సమస్యలను విన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ ఈసం కృష్ణయ్యను కలిసి కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వినతిపత్రాన్ని పరిశీలించిన జనరల్ మేనేజర్.. కార్మికులకు రావాల్సిన EPF, వేతనాలు, బోనస్ చెల్లింపుల విషయంలో తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ లేబర్ యూనియన్ ఇల్లందు అధ్యక్షుడు గోచికొండ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కోరం సురేందర్, INTUC చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముచ్చ సుధాకర్, యూనియన్ సభ్యులు తాటి శ్రీధర్, అంబాల చంద్రమౌళి, బానోత్ సైదులు, హలావత్ రఘురాం, పైడి రాజు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply