మంథని, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): మంథని మున్సిపల్ పరిధిలోని రావుల చెరువుకట్ట వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గణపతి హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గణేశుని ఆశీస్సులు కోరుకున్నారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గ ప్రజలతో పాటు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని, వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని, చేపట్టిన పనులు సజావుగా సాగేందుకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
సింగరేణి ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి పట్టాలు అందించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. గోదావరిఖని, మంచిర్యాల, మందమర్రి, కొత్తగూడెం, ఇల్లందు తదితర ప్రాంతాల్లో మిగిలిపోయిన సింగరేణి స్థలాల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి, అర్హులకు పట్టాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించినట్లు తెలిపారు.
అదేవిధంగా సింగరేణి కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివరించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గణేశుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు, మంథని ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, లోకకల్యాణం, రాష్ట్ర కల్యాణం కోసం తాను ప్రార్థించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply