మార్షల్ ఆర్ట్స్, యోగా రంగాల్లో సేవలకు విశిష్ట గౌరవం
‘సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్’, గ్లోబల్ మార్షల్ ఆర్ట్స్ బ్రూస్ లీ అవార్డు ప్రదానం
రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన యోగా, మార్షల్ ఆర్ట్స్ శిక్షకురాలు గోరంట్ల గీతాదేవి గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026లో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆమెకు ‘సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్’తో పాటు ‘గ్లోబల్ మార్షల్ ఆర్ట్స్ బ్రూస్ లీ అవార్డు’ ప్రదానం చేశారు.
మార్షల్ ఆర్ట్స్ రంగంలో ఆమె అందిస్తున్న సేవలు, శిక్షణా నైపుణ్యం, కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గీతాదేవి 2వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధకురాలిగా గుర్తింపు పొందడంతో పాటు గతంలో నంది, బుద్ధ అవార్డులు అందుకున్నారని, గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమంలోనూ గుర్తింపు పొందారని తెలిపారు.
అనేక సంవత్సరాలుగా యువత, విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్‌తో పాటు యోగా శిక్షణ అందిస్తూ వారిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గీతాదేవి మాట్లాడుతూ ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. తనకు సహకరించిన మాస్టర్ ఆవుల రాజానర్సు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు, సహచరులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ మార్షల్ ఆర్ట్స్, యోగా రంగాల్లో మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
గీతాదేవికి ఈ గౌరవం లభించడం పట్ల మాస్టర్ ఆవుల రాజానర్సు, ఆమె శిష్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పలువురు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.










Leave a Reply