విలేజ్ డెవలప్ సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల మూడో బ్యాచ్లు ప్రారంభం
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గ్రామీణ యువత, మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు దేవరకొండ పట్టణంలో విలేజ్ డెవలప్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి విద్యా శిక్షణా కేంద్రాల మూడో విడత బ్యాచ్లను ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల కొత్త బ్యాచ్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ హెల్త్ సీహెచ్ఓ ఆర్. గోపాల్ సింగ్, రిటైర్డ్ కండక్టర్ ధరం సింగ్, ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్, మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బోయిని చంద్రమౌళి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో నిరుద్యోగ యువత, మహిళలు చేతివృత్తులతో పాటు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పొందవచ్చని పేర్కొన్నారు. దేవరకొండ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్న విలేజ్ డెవలప్ సొసైటీ సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో విలేజ్ డెవలప్ సొసైటీ కోఆర్డినేటర్ భాషా చౌహాన్, నాయకులు టీక్య నాయక్, గోవర్ధన్, ఎన్. శాంతి, కే. కవిత, బి. నిహారిక తదితరులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణా తరగతులను యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.











Leave a Reply