నల్లగొండ నియోజకవర్గంలో రూ.850 కోట్లతో రహదారి అభివృద్ధి పనులు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
నల్లగొండ మండలం రాములబండ గ్రామ సమీపంలో రూ.107 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.850 కోట్లతో వివిధ రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రహదారి నిర్మాణాల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
🚜 జూలై 2028 నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనుల్లో ఇప్పటికే 600 మీటర్ల పురోగతి సాధించినట్లు మంత్రి తెలిపారు. అవసరమైన అదనపు నిధులను సమకూర్చుకుని జూలై 2028 నాటికి సొరంగ మార్గం పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయితే నల్లగొండ ప్రాంత రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించాలన్నదే తన ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
🪔 వినాయక మండపంలో ప్రత్యేక పూజలు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లగొండ పట్టణంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణనాథుడి విగ్రహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతిసౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
🤝 ప్రజల సమస్యలు విన్న మంత్రి
అంతకుముందు నల్లగొండ క్యాంప్ కార్యాలయం ‘ఇందిరా భవన్’లో వివిధ సమస్యలపై వినతిపత్రాలతో వచ్చిన ప్రజలను మంత్రి కలిశారు. వారి సమస్యలను స్వయంగా విన్న ఆయన, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply