క్రషర్ మిల్లు సమీపంలోని గుట్టల్లో పూర్తిగా కాలిపోయిన మృతదేహం గుర్తింపు
కొండమల్లేపల్లి, ఆగస్టు 29 (అయుష్ 24 న్యూస్):
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కొండమల్లేపల్లి–దేవరకొండ ప్రధాన రహదారిపై ఉన్న క్రషర్ మిల్లు సమీపంలోని గుట్టల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది.
క్రషర్ మిల్లులో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది గుట్టల ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
మృతదేహం వద్ద ఇంజెక్షన్ సూది (నీడల్), కాలిపోయిన దుస్తులు కనిపించినట్లు సమాచారం. దీంతో సదరు వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని తగులబెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.
పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండటంతో మృతుడి గుర్తింపు కూడా పోలీసులకు సవాల్‌గా మారింది.
📰 అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH










Leave a Reply