రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి అంతిమ దహన సంస్కారాల వరకు జరిగిన పరిణామాలను వివరించిన ఎల్ఐసీ మలక్‌పేట సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహాన్
దేవరకొండ, సెప్టెంబర్ 10 (అయుష్ 24 న్యూస్): అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. దేవరకొండ పట్టణానికి చెందిన ఎల్ఐసీ ఆల్ ఇండియా నాయకుడు గాజుల రాజేష్ కుమారుడు కీర్తిశేషులు అభినవ్ రాజ్ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
అభినవ్ రాజ్‌ను కాపాడేందుకు తాము చివరి వరకు ప్రయత్నించామని, అయితే పరిస్థితులు విషాదంగా మారాయని ఎల్ఐసీ మలక్‌పేట సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహాన్ తెలిపారు.
ప్రమాదం జరిగిన రోజు..
కుటుంబ సభ్యులతో గడిపిన అభినవ్ రాజ్ బయటకు వెళ్లి వస్తానని తల్లికి చెప్పి ద్విచక్ర వాహనంపై మహబూబ్‌నగర్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో డీసీఎం వాహనం ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదంలో తీవ్ర రక్తస్రావంతో పాటు తలకు బలమైన గాయాలు కావడంతో తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించడంతో దేవరకొండ లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ వనం శ్రీనివాసులు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు బయలుదేరినట్లు రాము చౌహాన్ తెలిపారు.
ఆక్సిజన్ అంబులెన్స్ కోసం ప్రయత్నం..
ఈ విషయాన్ని వనం శ్రీనివాసులు తనకు ఫోన్ చేసి తెలియజేశారని రాము చౌహాన్ చెప్పారు. అభినవ్‌కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నామని, అయితే అంబులెన్స్‌లో ఆక్సిజన్ సరిపోవడం లేదని చెప్పినట్లు తెలిపారు.
దీంతో తాను వెంటనే యశోద ఆసుపత్రికి వెళ్లి మరో ఆక్సిజన్ అంబులెన్స్ తీసుకుని మార్గమధ్యంలో వారిని కలిసేందుకు బయలుదేరినట్లు వివరించారు. ప్రయాణంలో వనం శ్రీనివాసులు ఎక్కడికి వచ్చారో ఫోన్లో అడుగుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారని చెప్పారు.
అయితే తాము అభినవ్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం అందిందని రాము చౌహాన్ తెలిపారు.
“అభి ఇక లేడు” అన్న వార్తతో షాక్‌కు గురయ్యా..
“అభి ఇక లేడు” అనే వార్త విన్నప్పుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని రాము చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త నిజం కాకపోతే బాగుండని అనుకున్నానని తెలిపారు.
అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి అదే రాత్రి దేవరకొండకు తిరిగి వచ్చానని, అక్కడ రాజేష్, ఉషారాణి దంపతుల బాధను చూసి తట్టుకోలేకపోయానని అన్నారు.
అభినవ్ రాజ్‌ను చివరిసారిగా చూసేందుకు వందలాది మంది తరలివచ్చారని తెలిపారు. ఎక్కడ చూసినా విషాద వాతావరణం నెలకొందని, రాజేష్ తీవ్ర విషాదంలో స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన ఎల్ఐసీ నాయకులు
అభినవ్ రాజ్‌ను చివరిసారిగా చూసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్ఐసీ ఆల్ ఇండియా నాయకులు, వివిధ మండలాల ఏజెంట్లు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
“రాజేష్ కుటుంబానికి అండగా ఉంటాం”
గాజుల రాజేష్ తనకు స్నేహితుడు మాత్రమే కాదని, ఆత్మబంధువులాంటి వ్యక్తి అని రాము చౌహాన్ పేర్కొన్నారు. ప్రతి విషయంలో తనకు అండగా నిలిచే గొప్ప మనసున్న వ్యక్తి రాజేష్ అని, అలాంటి వ్యక్తి కుమారుడిని కోల్పోవడం తీరని లోటని అన్నారు.
ఈ కష్ట సమయంలో రాజేష్ కుటుంబానికి తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కష్టాల్లో, కన్నీళ్లలో, సుఖదుఃఖాల్లో స్నేహితుడికి అండగా నిలవడం ద్వారా బాధలో ఉన్న కుటుంబానికి ధైర్యం, నమ్మకం కలుగుతుందని అన్నారు.
అభినవ్ రాజ్ మృతి పట్ల రాము చౌహాన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.



Musini.Anjan





Leave a Reply