చుక్కల్లోకెక్కిన చక్కనోడు… నీ జ్ఞాపకాలతోనే జీవిస్తాం
కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ సంస్మరణ సభలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నివాళులు
దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:
“అభి… నువ్వు మా నుంచి దూరమైనా… మా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ధ్రువతారగా కనిపిస్తూనే ఉంటావు” అంటూ కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ తల్లిదండ్రులు గాజుల రాజేష్, ఉషారాణి కన్నీటి పర్యంతమయ్యారు.
కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ సంస్మరణ సభను శనివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, సోదరి, కుటుంబ సభ్యులు అభినయ్ రాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సంస్మరణ సభకు హాజరైన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినయ్ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చిన్న వయసులోనే దూరమైన అభి
చిన్న వయసులోనే తల్లిదండ్రులకు దూరమైన అభినయ్ రాజ్… కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు కన్నీటి వేదనను మిగిల్చాడని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
అభి చిన్నతనం నుంచి అందరితో సరదాగా, నవ్వుతూ కలిసిమెలిసి ఉండేవాడని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు. గాజుల సాంబయ్య కుటుంబంలోని అత్తలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలతో ఎంతో ఆప్యాయంగా, సరదాగా గడిపే అభి ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
చిత్రపటం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్న దృశ్యాలు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.
“అభి… మాకు ఎందుకు దూరమయ్యావు? మేము ఏ పాపం చేశాము?” అంటూ తల్లిదండ్రులు కన్నీటితో విలపించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది.
వేలాదిగా తరలివచ్చి అభినయ్ రాజ్‌కు నివాళులు
గాజుల ఆంజనేయులు, రాజేష్ కుటుంబం దేవరకొండ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు సుపరిచితమైన కుటుంబం.
గాజుల రాజేష్ సివిల్ లాయర్‌గా పేరుప్రఖ్యాతులు పొందడంతో పాటు వార్డు సభ్యుడిగా, ఎల్ఐసీ ఏజెంట్‌గా, లయన్స్ క్లబ్లో సుదీర్ఘకాలంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా కొనసాగుతున్నారు. దీంతో ఆయన కుటుంబానికి పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అభినయ్ రాజ్ మృతి అనంతరం చివరిసారిగా చూసేందుకు, అంత్యక్రియలకు హాజరైన పలువురు… సంస్మరణ సభకు సైతం దూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు.
అభినయ్ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులర్పించడంతో పాటు, రాజేష్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని అందించారు.
“కన్ను మూసినా నీవే… కన్ను తెరిచినా నీవే…”
“కన్ను మూసినా నీవే… కన్ను తెరిచినా నీవే… ఎక్కడ ఉన్నావు అభి? ఎప్పుడు వస్తావు?” అంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాలనీవాసులు భావోద్వేగానికి గురయ్యారు.
ప్రతి సంవత్సరం వినాయక చవితి ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనే అభినయ్ రాజ్ ఈసారి కనిపించకపోవడంతో ఆయన స్నేహితులు, కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“అభి లేడు… మాకు ఏమీ తోచడం లేదు” అంటూ స్నేహితులు, కాలనీవాసులు ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
తన కుమారుడి గురించి కాలనీవాసులు అడిగినప్పుడు ఏమి చెప్పాలో… ఎలా చెప్పాలో కూడా తనకు మాటలు రావడం లేదని తండ్రి రాజేష్ కన్నీటి పర్యంతమయ్యారు.
తండ్రికి మనోధైర్యాన్ని అందించిన స్నేహితులు
కుమారుడు అభి జ్ఞాపకాలను మర్చిపోలేకపోయినప్పటికీ… తండ్రి రాజేష్‌కు స్నేహితులు, శ్రేయోభిలాషులు మనోధైర్యాన్ని అందించారు.
తిరిగి ధైర్యంగా నిలబడి, నవ్వుతూ అందరినీ నవ్విస్తూ, తన సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.
భగవంతుడు రాజేష్‌కు ఆరోగ్యం, మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పలువురు తెలిపారు.
ఈ సంస్మరణ సభలో దేవరకొండ పట్టణానికి చెందిన ఎల్ఐసీ లయన్స్ క్లబ్ సభ్యులు, బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మహిళలు, వ్యాపారవేత్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేలాదిగా తరలివచ్చిన వారు కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అభి భౌతికంగా దూరమైనా… ఆయన జ్ఞాపకాలు మాత్రం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.
— అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply