ఎంఈఓ నాగేశ్వరరావు నిర్లక్ష్యంపై RTISS ఆగ్రహం
కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం అమలు కావాల్సి ఉండగా, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల విద్యా వనరుల కేంద్రం (MRC–సమగ్ర శిక్ష) కార్యాలయంలో ఆర్టీఐ సమాచార బోర్డు ఏర్పాటు చేయలేదని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (RTISS) ఆరోపించింది.
RTISS వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు కె. బాబురాం నాయక్ ఈ విషయంపై స్పందిస్తూ.. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. కార్యాలయం వద్ద పౌర సమాచార అధికారి (PIO), అప్పీలేట్ అధికారి పేర్లు, హోదాలు, సంప్రదింపు వివరాలతో కూడిన సమాచార బోర్డు ఏర్పాటు చేయాలని స్థానిక ఎంఈఓ నాగేశ్వరరావును ఇప్పటికే నాలుగుసార్లు కోరినట్లు ఆయన తెలిపారు.
అయినప్పటికీ ఇప్పటివరకు బోర్డు ఏర్పాటు చేయలేదని బాబురాం నాయక్ ఆరోపించారు. సమాచార బోర్డు లేకపోవడం వల్ల మండల పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు సమాచార హక్కు చట్టం కింద ఎవరిని సంప్రదించాలో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
సమాచార బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు RTISS నాయకులు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించి, సంబంధిత అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు బాబురాం నాయక్ వెల్లడించారు.
ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు కార్యాలయాల్లో అవసరమైన సమాచారాన్ని బహిరంగంగా అందుబాటులో ఉంచాలని, కొండమల్లేపల్లి MRC కార్యాలయం వద్ద ఆర్టీఐ సమాచార బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని RTISS డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో RTISS నాయకులు ఎండి సిరాజ్ పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply