మొదటి ఏడాదిలోనే జిల్లా స్థాయి ఉత్తమ అధికారిణిగా గుర్తింపు
దేవరకొండ | అయుష్ 24 న్యూస్
80వ జాతీయ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దేవరకొండ మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నామని అర్చన జిల్లా స్థాయిలో ఉత్తమ సీనియర్ అసిస్టెంట్ అధికారిణిగా అవార్డు అందుకున్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా శనివారం ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా దేవరకొండ మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు నామని అర్చనను అభినందించారు. తనకు అవార్డు రావడానికి సహకరించిన కమిషనర్, ఏఈ, చైర్‌పర్సన్, ఎమ్మెల్యే, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బందికి అర్చన కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగ బాధ్యతలను మరింత బాధ్యతగా నిర్వహిస్తా: నామని అర్చన
దేవరకొండ మున్సిపాలిటీలో చేరిన మొదటి సంవత్సరంలోనే జిల్లా స్థాయిలో ఉత్తమ సీనియర్ అసిస్టెంట్ అధికారిణిగా అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉందని నామని అర్చన తెలిపారు.
ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, ఇకపై తన ఉద్యోగ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తానని చెప్పారు.
మహిళలకు అర్చన ఆదర్శం: చైర్‌పర్సన్
నామని అర్చనకు జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారిణిగా అవార్డు రావడం గర్వకారణమని మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు అన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అందుకు నామని అర్చనను ఉదాహరణగా తీసుకోవచ్చని తెలిపారు. కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళలు ఇలాంటి అవార్డులు అందుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలి: కమిషనర్ రామదుర్గారెడ్డి
నామని అర్చనకు ఉత్తమ సీనియర్ అసిస్టెంట్ అధికారిణిగా జిల్లా స్థాయి అవార్డు రావడం పట్ల మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఉద్యోగి ప్రజల కోసం అంకితభావంతో సేవలు అందించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడే ప్రభుత్వ అధికారులు, ప్రజల నుంచి ప్రశంసలు పొందగలరని అన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply