ఫామ్‌హౌస్ పరిసరాల్లో 144 సెక్షన్.. భారీగా పోలీసు బందోబస్తు
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 08:
గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి దళిత సంఘాలు పిలుపునిచ్చినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పోలీసులు ఫామ్‌హౌస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసి, భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఫామ్‌హౌస్ వైపు వెళ్లే మార్గాలను బారికేడ్లతో మూసివేసి, పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు.
దళిత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముట్టడికి వచ్చే అవకాశం ఉండటంతో పలు మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే పోలీసులు ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
దీంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఎర్రవెల్లి ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, సిద్దిపేట జిల్లా









Leave a Reply