భక్తుల కోరిక మేరకు దేవాలయాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు
దేవరకొండ, ఆగస్టు 29 | అయుష్ 24 న్యూస్
దేవరకొండ ఖిల్లా దుర్గం ఎడమ భాగాన, పర్వతరావు చెరువుకు వెళ్లే మార్గంలో ఉన్న కొండలను తొలిచి అద్భుత శిల్పకళా సంపదతో చెక్కిన కాలభైరవుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనే అరుదైన శిల్పకళా విశిష్టత కలిగిన ఈ విగ్రహాన్ని ఇటీవల పట్టణానికి చెందిన పలువురు యువకులు, మహిళలు పూజలు నిర్వహిస్తూ దర్శించుకుంటున్నారు.
ప్రతి శనివారం కాలభైరవుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొందరు వాహనాలపై, మరికొందరు కాలినడకన దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాలభైరవుని దర్శించుకుని పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో దేవాలయానికి వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు, పట్టణానికి చెందిన యువకులు, మహిళలు కలిసి దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లును రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.
భక్తుల కోరిక మేరకు శనివారం చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు పలువురు భక్తులతో కలిసి కాలభైరవుని దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాలభైరవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. భక్తులు, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలభైరవుని దేవాలయానికి వెళ్లే రహదారిని త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా శివాజీ యువదళ్ సభ్యులకు కూడా రహదారి నిర్మాణం విషయంలో హామీ ఇచ్చినట్లు తెలిపారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply