శ్రావణ శుక్రవారం భక్తులతో కిటకిటలాడిన మంథని శ్రీ మహాలక్ష్మి ఆలయం
మంథని, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): శ్రావణ మాసంలో కృష్ణాష్టమి పుణ్యతిథిని పురస్కరించుకుని శ్రావణ శుక్రవారం మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడింది.
ఉదయం 4 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం 4 గంటలకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ఉదయం 6 గంటలకు అర్చన అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు.
సాయంత్రం మహిళా భక్తులు మధురమైన భక్తిగీతాలతో శ్రీ మహాలక్ష్మి దేవి పవళింపు సేవ నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో సేవించారు.
భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన అర్చకులు మారుపాక ప్రశాంత్ శర్మ తెలిపారు. ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాల సందర్భంగా భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.
శుభ్రత ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ మహాలక్ష్మి ఆరాధనలో శుచిత్వానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు.
“యః శుచిః ప్రయతో భూత్వా! జుహుయాదాజ్యమన్వహం
శ్రియః పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్!!”
అనే మంత్రాన్ని ప్రస్తావిస్తూ శుభ్రతను పాటిస్తూ లక్ష్మీదేవిని ఆరాధించడం శ్రేయస్కరమని తెలిపారు. లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదని, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కూడా సంపదలో భాగమేనని వివరించారు.
శ్రావణ మాసంలో నిర్వహించే లక్ష్మీదేవి పూజలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, వరలక్ష్మీ వ్రతంలో పంచభూతాలకు ప్రతీకగా కలశాన్ని ప్రతిష్ఠించి పూజించే సంప్రదాయం ఉందని తెలిపారు.









Leave a Reply