కొండమల్లేపల్లి, ఆగస్టు 17: కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వార్డు సభ్యులు బూడిద మంజుల, మల్లేష్, ఎలిమినేటి సాయి, శంకర్ గౌడ్ సోమవారం కొండమల్లేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ తమ వార్డుల్లో విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు వినతులు అందించినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.అలాగే ఆగస్టు 15న నిర్వహించిన గ్రామసభను తూతూమంత్రంగా నిర్వహించారని, దీనిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను తదితర గ్రామపంచాయతీకి రావాల్సిన పన్నులను బిల్ కలెక్టర్లు వసూలు చేసిన రోజే ఎస్‌టీఓలో జమ చేయాల్సి ఉండగా, వసూలైన మొత్తాలను 10 నుంచి 15 రోజుల వరకు వ్యక్తిగత అవసరాలకు వినియోగించి అనంతరం జమ చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్, చెత్త సేకరణ వాహనాలు, ట్యాంకర్లను సొంత పనులకు, కాంట్రాక్టు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

పంచాయతీ సిబ్బంది సర్పంచ్ ఆదేశాలను పాటించకపోతే గైర్హాజరు నమోదు చేసి జీతాలు నిలిపివేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.14 వార్డులకు నిష్పక్షపాతంగా సేవలందించాల్సిన గ్రామ కార్యదర్శి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చగా మారుతుందని వారు పేర్కొన్నారు.ప్రజావాణిలో అందించిన ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి, ఆరోపణలపై న్యాయపరమైన విచారణ జరిపి, బాధ్యులపై ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు అధికారులను కోరారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply