రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది: మంత్రి శ్రీధర్ బాబు
మల్హర్ మండలం, ఆగస్టు 30: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ఆదివారం మల్హర్ మండలం కొయ్యూరులో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాన్ని, అలాగే నయారా నూతన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఐదు మండలాలకు సంబంధించి కాటారంలోనే ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రం ఉండేదని తెలిపారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల్లో కొంత జాప్యం జరిగి రైతులకు సకాలంలో సేవలు అందక ఇబ్బందులు ఎదురయ్యేవని పేర్కొన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొయ్యూరులో కూడా ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే నాగులమ్మ నుంచి తాడిచెర్ల వరకు, తాడిచెర్ల నుంచి ఖమ్మంపల్లి బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణానికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం కింద నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
మల్లారం ఎక్స్‌రోడ్ నుంచి పెద్దతూండ్ల వరకు, పెద్దతూండ్ల నుంచి చిన్నతూండ్ల మీదుగా మల్లారం వరకు రోడ్డు నిర్మాణానికి కూడా త్వరలో నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జెన్కో ఓపెన్‌కాస్ట్ డేంజర్ జోన్ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాడిచెర్ల నుంచి భూపాలపల్లి పట్టణానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేస్తూ.. ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

అనంతరం కొయ్యూరులో నూతనంగా ఏర్పాటు చేసిన నయారా పెట్రోల్ బంక్‌ను మంత్రి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, నాణ్యతతో కూడిన పెట్రోల్, డీజిల్‌ను అందుబాటులో ఉంచాలని బంక్ నిర్వాహకులకు సూచించారు. స్థానిక రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసిన యజమాని సాయి కృష్ణను మంత్రి అభినందించారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply