ఎస్సీ, ఎస్టీల గౌరవం, హక్కుల పరిరక్షణకు పోరాటం: కాంగ్రెస్ ఎంపీలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్‌లో పర్యటించిన ప్రాంతంలో “శుద్ధికరణ” పేరుతో జరిగిన ఘటనను కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉందని కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఢిల్లీలోని అక్బర్ రోడ్‌లో ఉన్న ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ హాజరయ్యారు.
సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఉత్తరాఖండ్ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎంపీలను పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. స్టేషన్ వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించినట్లు పేర్కొన్నారు.
ఖర్గే పర్యటించిన ప్రాంతంలో “శుద్ధికరణ”కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో కులం ఆధారంగా వివక్షకు తావు ఉండకూడదని వారు పేర్కొన్నారు.
మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ఈ అంశంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ ఘటనకు నిరసనగా సెప్టెంబర్ 12న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ప్రకటించింది.
– అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, న్యూఢిల్లీ









Leave a Reply