ఫారెస్ట్, పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్, వ్యకాస డిమాండ్
బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి: ఉప్పలి మల్కయ్య
యాలాల, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట్ మండల పరిధిలో గిరిజన కుటుంబం నిర్మించుకుంటున్న ఇంటిని అటవీ, పోలీసు అధికారులు జేసీబీలతో కూల్చివేశారంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్, వ్యకాస నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం యాలాల మండల కేంద్రంలో విడుదల చేసిన ప్రకటనలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యకాస జిల్లా అధ్యక్షుడు యు. బుగ్గప్ప మాట్లాడారు.
వారి ప్రకారం.. బొంరాస్పేట్ మండలంలోని ఎనిమితండా పంచాయతీ పరిధిలోని ఊరేంటి తండాలో హరిచంద్ర నాయక్ కుటుంబానికి చెందిన రవి నాయక్, రాము నాయక్ నూతన ఇంటి నిర్మాణం చేపట్టారని తెలిపారు. సుమారు 200 గజాల స్థలంలో 16 పిల్లర్లతో నిర్మిస్తున్న ఇల్లు స్లాబ్ దశకు చేరుకున్న సమయంలో పోలీసు, అటవీ శాఖ అధికారులు జేసీబీలతో కూల్చివేశారని ఆరోపించారు.
ఇంటి నిర్మాణాన్ని కూల్చివేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. బాధిత గిరిజన కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, నిబంధనల ప్రకారం రూ.50 లక్షల పరిహారం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధిగా ఈ ఘటనపై ప్రత్యేకంగా స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేయాలని కోరారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి కొడంగల్ పర్యటన సందర్భంగా నిరసన చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply