అయుష్ 24 న్యూస్ | వరంగల్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన 70.19 గ్రాముల బంగారు ఆభరణాలు, 527.9 గ్రాముల వెండి, రూ.29,875 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాలపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు కోసం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
గతంలో జరిగిన చోరీలను విశ్లేషించిన పోలీసులు సోమవారం ఉదయం ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు చోరీలకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడిని **ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల (27)**గా పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా, తెలంగాణకు చెందిన అతను ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
నిందితుడు పగటి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి వేళల్లో ఆ ఇళ్లలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. ఇదే తరహాలో 2024, 2025 సంవత్సరాల్లో మహారాష్ట్రలో నాలుగు చోరీలకు పాల్పడిన నిందితుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు.
అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మిల్స్ కాలనీ పరిధిలోని శివనగర్, ఎస్‌ఆర్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
అంతరాష్ట్ర నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ స్వామి, ఎస్‌ఐ మహేష్, ఏఏఓ సల్మాన్ పాషాతో పాటు సీసీఎస్, మిల్స్ కాలనీ పోలీస్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు.
— దారా కవిత
సెంట్రల్ జోన్ డీసీపీ










Leave a Reply