ఉపాధ్యాయ వృత్తితో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ విశేష సేవలు
కొత్తగూడెం, సెప్టెంబర్ 7 – అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై జిల్లాస్థాయి అవార్డు అందుకున్న కుంగ్ ఫూ సీనియర్ మాస్టర్, పెనుబల్లి సెకండ్ గ్రేడ్ టీచర్ మాలోత్ రాజాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంగ్ ఫూ–మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
కుంగ్ ఫూ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించిన మాలోత్ రాజా, వేలాది మంది యువతీ యువకులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ అందిస్తూ వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు ఉపాధ్యాయ వృత్తిలోనూ అంకితభావంతో విధులు నిర్వహిస్తూ విద్యా రంగంలో తన ప్రతిభను చాటుకున్నందుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
“రాజా సాధించిన అవార్డు అందరికీ గర్వకారణం”
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంగ్ ఫూ–మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐ. ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి పి. కాశీ హుస్సేన్ మాట్లాడుతూ.. మాలోత్ రాజా మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రతిభ కనబరిచి మంచి గుర్తింపు పొందడంతో పాటు ఉపాధ్యాయ వృత్తిలోనూ అంకితభావంతో విధులు నిర్వహిస్తూ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడం అభినందనీయమన్నారు.

మార్షల్ ఆర్ట్స్‌తో పాటు ఉపాధ్యాయ వృత్తిలోనూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. తద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని వారు కోరారు.
“ప్రోత్సాహం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు”
సన్మాన గ్రహీత మాలోత్ రాజా మాట్లాడుతూ.. తాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు సాధించేందుకు ప్రోత్సాహం అందించిన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్, తోటి ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
మున్ముందు మరింత అంకితభావంతో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్ రంగంలోనూ పలు కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.
పలువురు మాస్టర్లు, కోచ్‌లు పాల్గొనడం
జిల్లా కుంగ్ ఫూ–మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఐ. ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి పి. కాశీ హుస్సేన్, ఉపాధ్యక్షులు వై. సుబ్రహ్మణ్యం, ఇ. మొగిలి, ఎం. మల్లికార్జునరావు, కార్యనిర్వాహక కార్యదర్శి బి. సాగర్, సభ్యులు టి. రాజుతో పాటు పలువురు కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply