డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా గ్లోబల్ సమ్మిట్
పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉపాధే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026’ ఏర్పాట్లు, రోడ్‌షోలు, ఎంవోయూలు, ఇతర అంశాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఆబిడ్స్‌లోని ఇండస్ట్రీస్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో సమ్మిట్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో మంత్రి చర్చించి, నిర్దేశిత గడువులో ఏర్పాట్లు పూర్తి చేసేలా దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించి, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు గ్లోబల్ సమ్మిట్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026ను రాష్ట్ర ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేలా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు.
పెట్టుబడులకు అనుకూల వాతావరణం
తెలంగాణను పెట్టుబడులకు మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా బలోపేతం చేయడంతో పాటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచేలా పలు కొత్త పాలసీలను ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేలా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక రోడ్‌షోలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల పరిస్థితులపై పారిశ్రామికవేత్తలకు సమగ్ర అవగాహన కల్పించేలా సమ్మిట్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఎంవోయూల అమలుపై ప్రత్యేక దృష్టి
గతంలో కుదిరిన ఎంవోయూలు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
ప్రతి ఎంవోయూపై ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఫాలోఅప్ చేస్తున్నామని, పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే రంగాలకు గ్లోబల్ సమ్మిట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.
అతిథులకు మెరుగైన ఏర్పాట్లు
విదేశీ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాజిస్టిక్స్, ప్రోటోకాల్, హాస్పిటాలిటీ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
శాఖల మధ్య సమన్వయంలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు, టైమ్‌లైన్లు నిర్దేశించినట్లు చెప్పారు. సమ్మిట్ ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
సమ్మిట్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.









Leave a Reply